పార్టీలు వేరైనా అభివృద్ధే ల‌క్ష్యం: డీకే అరుణ

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: రాజకీయ పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో అందరి లక్ష్యం ఒక్కటేనని, మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ డీకే అరుణ (DK Aruna) పిలుపునిచ్చారు. మంగళవారం నూతనంగా నిర్మించిన డైట్ కళాశాల భవనాన్ని ఆమె ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. దాదాపు 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన భవనంలో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబొరేటరీ, డిజిటల్ ల్యాబ్, ఆధునిక తరగతి గదులు, సెమినార్ హాల్, అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లైబ్రరీ, స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ యూనిట్స్ తదితర ఆధునిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

గ‌తంలో స‌దుపాయాల కోసం ఇబ్బందులు

యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లోని డైట్ కళాశాలను ఆధునిక సదుపాయాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా చారిత్రక విద్యా సంస్థకు పునర్వైభవం కల్పించామన్నారు. 1964లో ప్రారంభమైన డైట్ కళాశాల రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన సంస్థ అని, నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేయడంతో పాటు వారికి శిక్షణ అందించి నిష్ణాతులైన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ సంస్థ నిర్వర్తిస్తోందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కళాశాల ఎన్నో సంవత్సరాలుగా సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు.

నెలల వ్య‌వ‌ధిలోనే పూర్తి

గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కళాశాల అభివృద్ధిపై తగిన స్థాయిలో దృష్టి సారించలేదని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాల ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఓట్ల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కళాశాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఎంపీ డీకే అరుణతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సమగ్ర శిక్షా అభియాన్ కింద ఈ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసిన నూతన భవనాన్ని కేవలం కొన్ని నెలల్లోనే పూర్తి చేసి నేడు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

100 కంప్యూట‌ర్ల సామ‌ర్థ్యం

దాదాపు 100 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకునే సామర్థ్యంతో ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్‌ను నిర్మించామని, ప్రస్తుతం సుమారు 60 కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. మిగిలిన కంప్యూటర్లను కూడా త్వరలో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం, సమగ్ర శిక్షా ద్వారా సుమారు రూ.8.26 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కళాశాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సూచించిన మేరకు ఇంకా అవసరమైన అదనపు కంప్యూటర్లు, బాలురకు, బాలికలకు అదనపు టాయిలెట్లు, విద్యా పరికరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన అదనపు మౌలిక వసతులను కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

స్టేట్ హోంలో వ‌న మ‌హోత్స‌వం

రాబోయే రోజుల్లో అవసరాలను వంద శాతం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్టేట్ హోంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు మేగ్యా నాయక్, తిరుమల వెంకటేష్, ప్రశాంత్, రమేష్ రెడ్డి, పాతూరి రమేష్, తాహెర్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, గోవింద్ యాదవ్, చందు యాదవ్, తిరుపతి నాయక్, మోయీజ్, దోమ పరమేశ్వర్, కాటం రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మేరాజ్ ఉల్లాఖాన్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>