కలం, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో విభజన రాజకీయాలు చేసే శక్తులకు స్థానం లేదని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్ రెండో విడత ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచార సభలకు వచ్చిన ఆదరణపై మమతా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సామాన్య ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం, ఆప్యాయతలుతనను ఎంతగానో కదిలించాయని పేర్కొన్నారు. బెంగాల్ గడ్డపై కొన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రజలతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో టీఎంసీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ వారసత్వాన్ని, సంస్కృతిని కించపరిచే శక్తులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని మమతా స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని ఏ శక్తి అడ్డుకోలేదని, తమ సంక్షేమ పథకాలు ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి ఏప్రిల్ 29న జరిగే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా అందరూ జంట పువ్వుల గుర్తుపై ఓటు వేసి, తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

