Mobile Popup Ad
Mobile Popup Ad

లెఫ్ట్ అండ్‌ రైట్.. కవిత సరికొత్త రాజకీయం!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన పొలిటికల్ జర్నీలో ఆసక్తికరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు ఆలయ దర్శనాలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ హిందు ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కమ్యూనిస్టు నాయకులతో సమావేశాలు, వామపక్ష భావజాల ప్రతినిధులతో సంభాషణలు జరిపి ఆ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మాజీ మావోయిస్టు దేవ్‌జీని ఆస్పత్రిలో పరామర్శించారు. ఇది వ్యక్తిగత లేదా మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తున్నా.. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కూడా దోహదపడే అంశమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో అన్యాయానికి గురైనవారినీ కలుస్తున్నారు. తాజాగా నేరెళ్ల బాధితులతో సమావేశమై.. వారి బాధలు ఆలకించారు. కొత్త పార్టీతో తనకంటూ ప్రత్యేక పొలిటికల్ స్పేస్ ఏర్పర్చుకునే ప్రయత్నంలో భాగంగా కవిత తీసుకుంటున్న రాజకీయ, సామాజిక కార్యక్రమాలు హాట్ టాపిక్గా మారాయి.

అందరికీ చేరువయ్యేలా..!

తెలంగాణలో రాజకీయంగా నిలదొక్కుకోవాలనుకునే నాయకులు ఒకే భావజాలానికి పరిమితం కాకుండా విభిన్న సామాజిక వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ‘నక్సలైట్లే నిజమైన దేశభక్తులు’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ ‘నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా’ అన్నారు. కవిత ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయ పంథా కూడా అదే తరహాలో ఉందన్నది పొలిటికల్ సర్కిల్స్లో వాదన. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, మహిళా సమస్యలు, సామాజిక అంశాలు, అస్తిత్వ పోరాటం, బతుకమ్మ-బోనాల సంస్కృతి పరిరక్షణ తదితరాలపై ఎక్కువగా మాట్లాడిన కవిత.. కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. తద్వారా సంప్రదాయవాద, భక్తి భావాలు కలిగిన వర్గాలకు చేరువ కావాలని భావించారు. పార్టీ యాక్టివిటీస్ ప్రారంభమయ్యే దశలో పలు వామపక్ష పార్టీల ప్రతినిధులతో, ట్రేడ్ యూనియన్ లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజా సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు.

ప్రస్తుత రాజకీయాలు దేశవ్యాప్తంగానే హిందుత్వ, లౌకికవాద, జాతీయవాద, వామపక్ష లాంటి భావజాలాల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ప్రాంతీయత, సామాజిక న్యాయం, సంక్షేమం, సాంస్కృతిక గుర్తింపు వంటి అంశాలు ఇప్పటికీ ఎఫెక్టివ్‌గా, ఎమోషనల్‌గా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వర్గాన్నీ దూరం చేసుకూకడదనే ముందుచూపుతో కవిత అడుగు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటు హిందూ భావోద్వేగాలకూ దూరం కావొద్దు.. అటు ఉద్యమ రాజకీయాలు, వామపక్ష వర్గాలకూ చేరువగా ఉన్నామనే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నట్లు కవిత పర్యటనలు, పరామర్శలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రత్యేక గుర్తింపు కోసం..!

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. బీజేపీ విస్తరణ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీగా కల్వకుంట్ల కవితకు ప్రత్యేక గుర్తింపు అనివార్యమైంది. ప్రజల భావోద్వేగాలు, తెలంగాణ ఉద్యమ వారసత్వం, ఆధ్యాత్మిక అంశాలు, సామాజిక న్యాయం, ఉద్యమ రాజకీయాలు.. ఇలాంటి భిన్నమైన అంశాలను మేళవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యూహం తాత్కాలిక చర్చకే పరిమితమవుతుందా?.. లేక తెలంగాణ రాజకీయాల్లో ఆమెకు కొత్త స్పేస్ క్రియేట్ అవుతుందా?.. రాబోయే నెలల్లో ఆమె చేపట్టే పార్టీ నిర్మాణం, రూపొందించే ఎజెండా, నిర్వహించే రాజకీయ కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.

బీఆర్ఎస్ బాధితులతోనూ..!

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారితో కవిత వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే ఈ మీటింగ్స్ స్టార్ట్ చేశారు. కొత్తగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) స్థాపించాక మరింత మందిని కలుస్తున్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను గుర్తించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇప్పటికే మండిపడ్డారు. తాజాగా నేరెళ్ల బాధితులతోనూ కవిత సమావేశమయ్యారు. సిరిసిల్ల మానేరు నది ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వం తమను వేధించిన తీరును బాధితులు ఆమెకు వివరించారు. నేరెళ్ల ఘటనపై విచారణ జరిపించి.. బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>