కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC) ద్వారా జర్మన్, జపనీస్ భాషల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏటీసీ (Manuguru ATC) విద్యార్థుల నూతన ఆవిష్కరణల అభినందన సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏటీసీ విద్యార్థులు పార్థసారథి, స్ఫూర్తి పాత వాహనాల విడిభాగాలతో సొంతంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ను మంత్రి పరిశీలించి అభినందించారు. ఈ ప్రాజెక్ట్ను కమర్షియల్ వెహికల్గా అభివృద్ధి చేసేందుకు కార్మిక శాఖ తరఫున అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. విద్యార్థులు తయారు చేసిన ఈవీ వాహనాలను స్థానిక సింగరేణి సంస్థ అవసరాలకు వినియోగించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా టాటా సంస్థతో కలిసి రూ.4వేల కోట్లతో 119 ఏటీసీలను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న 100 మంది విద్యార్థులకు టాటా సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ‘టామ్కామ్’ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో కొలువులు సాధించేలా రూ.90 కోట్లు కేటాయించామని, చెన్నూరు తరహాలోనే మణుగూరులోనూ లాంగ్వేజ్ ట్రైనింగ్ అందిస్తామన్నారు. విద్యార్థుల కోసం త్వరలోనే రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు, మారుమూల ప్రాంత రైతుల కోసం ఆధునిక వ్యవసాయ కోర్సులను ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఏటీసీ వద్ద రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ట్రైనింగ్ సెంటర్స్ జాయింట్ డైరెక్టర్ నగేశ్, టామ్కామ్ ఈవో గౌస్ పాషా, కళాశాల ప్రిన్సిపాల్ సారంగపాణి పాల్గొన్నారు.

