కలం, మక్తల్ : ఊరురా పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి వనాలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందామని మక్తల్ ఎంపిడిఓ రమేష్ (Makthal MPDO) అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మక్తల్ మండలంలోని జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నారు. మక్తల్ మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో నాటేందుకు అవసరమైన మొక్కలు ఇప్పటికే నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, యువకులు తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీవో సత్య ప్రకాష్, గుడిగండ్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మాధవరావు, సత్య శ్రీను, భరతసింహ రెడ్డి, తిరుపతి, రమేష్, రాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

