మక్తల్ అభివృద్ధికి రూ. 2,200 కోట్లు.. మంత్రి వాకిటి కీలక ప్రకటన!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సమాజంలో తెలివి ఉన్నోడు విషయం తెలిసి ఉన్నోడు మౌనంగా ఉంటే అవినీతి రాజ్యమేలుతుందని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. మంగళవారం మక్తల్ (Makthal) నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మక్తల్ మండలంలోని 39 గ్రామాల వారీగా మక్తల్ క్యాంపు కార్యాలయంలో సర్పంచ్‌లు, ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూలంకషంగా చర్చించారు. గ్రామాల వారీగా సమస్యలను స్వయంగా నోట్ చేసుకున్న మంత్రి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు.

ఈ సందర్భంగా మంత్రి (Vakiti Srihari) మాట్లాడుతూ.. తెలివి ఉండి, విషయం తెలిసి ఉన్నవారు నోరు మూసుకొని ఉంటే అన్యాయం రాజ్యమేలుతుందని, ప్రస్తుతం మక్తల్‌లో జరుగుతున్న అభివృద్ధిపై నాయకులు గళం విప్పాలని సూచించారు. తాను ఈ గడ్డపైనే పుట్టానని, పుట్టిన నేలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు. మక్తల్ నియోజకవర్గంలో ప్రస్తుతం సుమారు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఇన్నేళ్లుగా జరగని అభివృద్ధి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు సంతోషపడాలో.. ఇన్నాళ్లు ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని బాధపడాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మక్తల్ ప్రాంతం నేడు తన రూపురేఖలను మార్చుకుంటూ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని స్పష్టం చేశారు. మక్తల్ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కీలక పనులను మంత్రి వివరించారు.

మక్తల్ నియోజకవర్గంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 500 కోట్లతో బీటీ రహదారులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని గ్రామాలన్నింటిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మక్తల్ పట్టణంలో ఆధునిక వైద్య సదుపాయాలతో 80 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు, అది ఈ సంక్రాంతి లోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. క్రీడాకారుల ప్రతిభకు వేదిక కల్పించేందుకు 26 కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మిస్తున్నామన్నారు.

మక్తల్–నారాయణపేట నాలుగు లేన్ల రహదారికిరూ. 237 కోట్లతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. భూత్పూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన గ్రామాలకు బదులుగా ఆధునిక హంగులతో నూతన పునరావాస గ్రామాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అనుగొండకు 50 కోట్లు, అంకెన్‌పల్లికి 28 కోట్లు, దాదన్‌పల్లికి 30 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించిందని వివరించారు.

చిట్యాల–గజరందొడ్డి బ్యారేజీ కమ్ బ్రిడ్జి, కాట్రేవుపల్లి బ్రిడ్జితో పాటు పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, ఇందులో కొన్ని పూర్తయ్యి అందుబాటులోకి వచ్చాయని మంత్రి గుర్తు చేశారు. గతంలో మక్తల్‌లో విద్యారంగ అభివృద్ధి కుంటుపడిందని, డిగ్రీ కళాశాల లేక ఇంటర్మీడియట్‌తోనే చదువు ఆపేసిన ఎంతోమంది విద్యార్థులకు ఇప్పుడు మక్తల్‌లో డిగ్రీ కళాశాల అందుబాటులోకి రావడంతో ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం లభించిందన్నారు.

విదేశీ విద్యకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గానికి చెందిన 64 మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించామన్నారు. గతంలో నారాయణపేటకు వెళ్లాల్సిన కోర్టు సేవలు ఇప్పుడు మక్తల్‌కే అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొంటూ, ఇది ప్రాంత అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి వివరించారు.

అభివృద్ధిపై విమర్శలు కాదు.. వాస్తవాలు తెలుసుకోవాలి

మక్తల్–నారాయణపేట నాలుగు లేన్ల రహదారికి ఇప్పటికే రూ.237 కోట్లు మంజూరై, టెండర్లు కూడా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రహదారి కోసం పాదయాత్ర చేపట్టడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శించారు. అభివృద్ధి పనుల వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.

మక్తల్‌(Makthal)లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు జోడెద్దుల్లా సమాంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్న మంత్రి, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమష్టి అభివృద్ధికే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. నేను బాగుండాలి అనుకుంటే సరిపోదు.. మనమంతా బాగుంటేనే నియోజకవర్గం బాగుంటుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలని సూచించారు. గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Also Read : అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రంపై రూ. కోట్ల అదనపు భారం: ఎంపీ చామల

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>