కలం, వనపర్తి: వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.29.20 కోట్లను మంజూరు చేసింది. ఇందులో వనపర్తి మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, పెబ్బేరుకు రూ.9.20 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి ఈ ప్రాజెక్టులకు ఆమోదం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
త్వరలో టెండర్లు: స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) 2.0 కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో ఎల్‌ఎస్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పనులు చేపట్టనున్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడే మురుగునీటిని శాస్త్రీయంగా సేకరించి, సివరేజ్ వ్యవస్థ (Sewerage System) ద్వారా తరలించి, శుద్ధి చేసి సురక్షితంగా నిర్వహించే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
దీంతో పట్టణ పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు మేలు చేకూరుతుందని తెలిపారు. వనపర్తి పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పట్టణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టులకు ఆమోదం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

