నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలి : బీఆర్ఎస్

కలం, కరీంనగర్ బ్యూరో : ఎన్నికల సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నారాయణపూర్ (Narayanapur) గ్రామానికి వచ్చి మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా చేస్తానని చెప్పి దేవుని మీద ఒట్టు వేసి ఇప్పుడు మాట తప్పారని బిఆర్ఎస్ నేతలు సుంకే రవిశంకర్, కొత్త జైపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటింకపోతే పది రోజుల్లోగా ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి మార్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

నారాయణపూర్ గ్రామస్తులకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలకు సోమవారం బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌లు పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. పోలీసులు చొప్పదండి ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామస్తులపై మేడిపల్లి సత్యం కక్ష కట్టాడని ధ్వజమెత్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>