కలం, నిజామాబాద్ బ్యూరో: వరంగల్ వేదికగా సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ గౌడ్ (Mahesh Goud) నిజామాబాద్‌లో స్పందించారు. తెలంగాణలో ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో 89 లక్షల ఓట్లను బీజేపీ చోరీ చేసిందని ఆరోపించిన మహేశ్.. ఈసారి తెలంగాణలో ఆ పరిస్థితులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటామని, ప్రతి పౌరుని ఓటు పోకుండా కాపాడతామని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో తెలుస్తుందని అన్నారు. అప్పుడు తాము ఏం చేస్తున్నామో అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని సూచించారు. 100కు 100 శాతం కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లతో అధికారాన్ని సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

