కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖ మంత్రి పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మంత్రి వర్గంలో సముచిత వాటా దక్కలేదనే విషయాన్ని రాహుల్ గాంధీకి కూడా చెప్పానని వివరించారు. అలాంటిది బీసీ మంత్రిగా కొండా సురేఖను ఎందుకు తొలగిస్తామన్నారు. మంత్రి వర్గంలో బీసీల సంఖ్య పెంచాలని అధిష్ఠానానికి చెప్పినట్లు వివరించారు. కొండా సురేఖ ఏఐసీసీ సభ్యురాలని, ఆమె విషయాన్ని హై కమాండ్ చూసుకుంటుందన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.
టికెట్ల నిర్ణయం హై కమాండ్‌దే..
టికెట్ల కేటాయింపు నిర్ణయం అధిష్ఠానానిదే అని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ప్రోత్సహించడానికే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు తప్ప, టికెట్ ప్రకటించినట్లు కాదన్నారు. ఎమ్మెల్యేను అభినందించే క్రమంలో అలా అని ఉంటారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల్లో మెజార్టీ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

