కలం, కరీంనగర్: నగరపాలక సంస్థ సాధారణ సభ్య సమావేశంలో కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ (Corporator Anjan Kumar) ‘జీరో అవర్’ ‘ఎజెండా’ అంశాలపై పలు కీలక ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆదర్శ్ నగర్ లోని ఖాళీ ఓపెన్ ప్లాట్లలో చెత్త, చికెన్ సెంటర్ల వ్యర్థాలు వేయడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తామని హామీ ఇచ్చారు.
MHO సుమన్ అనే ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వరవర్ధపై ప్రభుత్వ ఉద్యోగిలా సంతకాలు పెడుతూ, గ్రీన్ పెన్ వాడుతూ అవినీతికి పాల్పడుతున్నాడని, వెంటనే అతడిని సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ స్పందిస్తూ “మీ అందరి కోరిక మేరకు పంపిస్తానని” హామీ ఇచ్చారు. అధికారుల హాజరు: కౌన్సిల్ మీటింగ్ కు రెవెన్యూ, హౌసింగ్, ట్రాన్స్ కో, R&B విభాగాల నుండి DE/MRO స్థాయి అధికారులను పిలిపించి సమావేశంలో ఉంచాలని కోరారు.
భూగర్భ జలాలు అడుగుంటున్నాయని, అవసరమైన వారికి రెండో నల్లా కనెక్షన్ ఇవ్వాలని, గతంలో నిలిచిపోయిన రెండో నల్లా కనెక్షన్లను పునరుద్ధరించాలని కోరారు. స్మార్ట్ సిటీ ద్వారా బిగించిన వీధి లైట్లు వెలగడం లేదని, వెంటనే వాటిని వెలిగించాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలను ఆపరేషన్ చేసి మళ్లీ అదే గల్లీలో వదలడంతో అవి దూకుడుగా మారి ప్రజలపై దాడి చేస్తున్నాయని, వాటిని వేరే చోటికి తరలించాలని కోరారు. జీరో అవర్ తర్వాత ఎజెండాలోని అంశాలపై మాట్లాడుతూ కొన్ని అంశాలు తప్పుల తడకగా ప్రచురించారని ఉదాహరణలతో సభ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ వాటిని సరి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే 90వ అంశంపై మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ ద్వారా DPR తయారు చేసిన RV ఇంజినీరింగ్ కన్సల్టెంట్ గురించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 70 కోట్ల స్మార్ట్ సిటీ నిధుల కోసం KCCL తీసుకున్న నిర్ణయం CDMA ద్వారా ప్రచురించిన అంశంపై గత DPRలో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు. DPR తయారు చేసిన తర్వాత గౌరవ సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూఇది CDMA ద్వారా తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చారు.

