కలం, మెదక్ బ్యూరో: 22A దందాతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే మంత్రి పొంగులేటిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఎలాంటి అప్లికేషన్ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆస్తులను 22A జాబితా నుంచి రాత్రికి రాత్రే ఎలా తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao ) డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 22A భూముల బాధితుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలో లక్ష ఇళ్లు, 50 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని కబ్జా చేస్తోందని,30-40 ఏళ్లుగా నివాసముంటున్న వారిని కబ్జాదారులు అనడం దారుణమని హరీశ్ రావు మండిపడ్డారు. 98 శాతం భూములను జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి బొంకుతున్నారని, ఆయన రెవెన్యూ మంత్రి కాదు.. ప్రజలను లూటీ చేసే ‘పొంగులూటి’ అని విమర్శించారు. వారంలోగా పటాన్‌చెరులోని 22A భూముల సమస్యను పరిష్కరించకపోతే సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించి, సమస్య తేలేదాకా అక్కడే ‘వంటావార్పు’ చేపడతామని హరీశ్ రావు హెచ్చరించారు.

