కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపు ప్రక్రియ వేగవంతం చేసినట్లు మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. అకాల వర్షాల కారణంగా సుమారు 564 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. ఆమె ఆదేశాలతో వ్యవసాయ, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సహకార, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ స్వయంగా పలు చోట్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి.. ప్రక్రియను పర్యవేక్షించారు. తడిసిన ధాన్యాన్ని అదనపు లారీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి అత్యవసరంగా మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టారు. ఇలా సుమారు 556 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సమీపంలోని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు విజయవంతంగా తరలించారు. మిగిలిన 8 మెట్రిక్ టన్నుల ధాన్యం వద్ద వరద నిల్వ ఉండటంతో వెంటనే తరలించడం సాధ్యం కాలేదన్నారు.
రూ.145 కోట్ల చెల్లింపులు..
జిల్లాలో ఇప్పటివరకు 15,046 మంది రైతుల నుంచి 83,591 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా వివరించారు. అందులో 81,681 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే వివిధ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే 11,267 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద సుమారు రూ.145 కోట్ల చెల్లింపులు చేసినట్లు తెలిపారు.

