పాఠశాలల్లో నైపుణ్యాల పెంపు: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపిక చేసిన 26 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంచేలా, ఆంగ్ల భాషలో మాట్లాడే సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) తెలిపారు. జిల్లా విద్యాశాఖ, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ రెడీనెస్ సంస్థ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. అక్టోబర్ చివరి వారం, నవంబర్ నెలలో ఎంపిక చేసిన 26 పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

నాలుగు ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నారు. యంగ్ ఒరేటర్స్ క్లబ్ ద్వారా విద్యార్థులకు తరగతి గది, సభా వేదికలపై స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలు, థింక్ అండ్ మేక్ కార్యక్రమం ద్వారా సమస్యలను గుర్తించడం, ప్రయోగాలు చేయడం, వాటికి స్వయంగా పరిష్కారాలను కనుగొనే నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నారు.

నిరంతర పర్యవేక్షణ..

మనీ మ్యాటర్స్ కార్యక్రమం ద్వారా సంపాదన, ఖర్చులు, పొదుపు, బ్యాంకింగ్ తదితర అంశాలపై ప్రాథమిక ఆర్థిక అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. కెరీర్ అవేర్‌నెస్ ద్వారా ఉన్నత విద్య కోర్సులు, భవిష్యత్తులో ఎంచుకోదగిన వృత్తులపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ రెడీనెస్ సంస్థ ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ, విద్యార్థులు అన్ని శిక్షణ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ సాయి శివాని, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ రెడీనెస్ సంస్థ ప్రతినిధులు కీర్తన, సంతోష్ ఈశ్వర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>