కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushbhoo Gupta) అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 132 వినతులను స్వీకరించారు.
ప్రజావాణి అనంతరం కలెక్టర్ ఖుష్బూ గుప్తా మండల ప్రత్యేక అధికారుల క్షేత్రస్థాయి బాధ్యతలపై సమీక్షించారు. మండలాలు, నియోజకవర్గాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ప్రతి వారం ఒక గ్రామ పంచాయతీని తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ ప్రస్తుతం లేని నేపథ్యంలో ప్రత్యేక అధికారుల బాధ్యతలు మరింత ప్రాధాన్యంగా మారాయని తెలిపారు.
ప్రతి గ్రామానికో అధికారి..
ప్రతి సోమవారం జిల్లా కార్యాలయం నుంచి ఒక్కో అధికారికి ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. సంబంధిత అధికారి అదే వారంలో బుధవారం లేదా మరొక రోజు తప్పనిసరిగా సందర్శించాలని అన్నారు. సోమవారం జరిగే సమీక్షలో తాము సందర్శించిన గ్రామంలో పరిశీలించిన అంశాలు, గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. గ్రామ పర్యటనను సాధారణ తనిఖీగా భావించకుండా, సర్పంచి, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలతో మాట్లాడి ప్రధాన సమస్యలను గుర్తించాలని సూచించారు.
పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలపై..
గ్రామ పంచాయతీ పర్యటన సందర్భంగా కనీసం రెండు పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. ఒక రెసిడెన్షియల్ పాఠశాల, జడ్పీ లేదా ప్రాథమిక పాఠశాల ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, విద్యార్థుల అభిప్రాయాలు, వసతి, వార్డెన్ల పనితీరు, ప్రిన్సిపల్ నిర్వహణ, ఉపాధ్యాయుల సమస్యలు, తాగునీరు, మరుగుదొడ్ల పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు పరిశీలించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు పశు వైద్య, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల కార్యాలయాలను సందర్శించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
దిశా సమావేశానికి సిద్ధం కావాలి..
అక్టోబర్ ఆరో తేదీన దిశ సమావేశం జరగనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన ప్రాజెక్టులు, ప్రస్తుతం అమలులో ఉన్న పనులు, పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదికలను వెంటనే పీడీఆర్కు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. గత దిశ సమావేశంలో చర్చించిన అంశాలు, అధికారులకు ఇచ్చిన సూచనలు, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్వో నిర్మల తదితరులు పాల్గొన్నారు.

