పేద ప్రజలను దోచుకుంటున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలి: కొండపల్లి రాము

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : అర్హతలు లేకున్నా, డాక్టర్లుగా చెలామణి అవుతున్న ఆర్ఎంపి డాక్టర్ల ( PMP Doctors)ఆగడాలపై జిల్లా వైద్యాధికారీ చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి రాము డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ సీపీఐ జిల్లా కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కొండపల్లి రాము మాట్లాడుతూ .. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో, పట్టణ శివారుల్లో వందలాది మంది అనుమతులు లేని ఆర్ఎంపి ,పిఎంపి డాక్టర్లు పుట్టుకొచ్చారని, వారు పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రోగాల పేరుతో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా హైదరాబాద్, మహబూబ్ నగర‌లోని (Mahabubnagar)బడా కార్పొరేట్ హాస్పిటల్స్‌తో కుమ్మక్కై రోగులను భయపెట్టి అక్కడికి రెఫర్ చేస్తూ రూ. 10 వేల నుండి రూ.30 వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారనీ ఆయన ఆరోపించారు.

ఎంబీబీఎస్ అర్హత లేకుండా స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన తెలిపారు. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా, ల్యాబ్ టెస్టుల పేరుతో నకిలీ రిపోర్టులు సృష్టించి వేలకు వేలు దోచుకుంటున్నారనీ ఆయన అన్నారు. దీని వల్ల పేద ప్రజలు అప్పులు చేసి, బంగారం బ్యాంకులో కుదువపెట్టి ఆస్పత్రులకు కట్టాల్సిన దుస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే అనుమతులు లేని ఆర్ఎంపి క్లినిక్‌లపై దాడులు చేసి, సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో ఏఐవైఎఫ్ ( AIYF)ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు బసవరాజ్, బి. మహేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, డీకే రామకృష్ణ, రఘు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>