కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పోలీసుల విధి నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలంటే పోలీస్ కవాతు ఎంతో అవసరమని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్.బి.రత్నం అన్నారు. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో పోలీసు సిబ్బందికి వారాంతపు కవాతు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది ప్రదర్శించిన డ్రిల్, కవాతు నిర్వహణను అదనపు ఎస్పీ పరిశీలించి సిబ్బంది క్రమశిక్షణ, సమన్వయాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. వారాంతపు కవాతు ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత, క్రమశిక్షణ మరింత పెరుగుతాయని తెలిపారు. విధుల్లో నిజాయితీ, అంకితభావం, సమయపాలనతో వ్యవహరించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిబ్బందికి చేయవలసిన విధులు, పాటించవలసిన క్రమశిక్షణ గురించి సూచనలు చేశారు. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని.. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడంతో పాటు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.

