Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల్లో 92 శాతం మంది రైతులు ఆ సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతోందన్నారు. గ్యారంటీ లేని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాడుకునే పాలకులు ఉన్న నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకేలో నిర్వహించిన 23వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని వర్చువల్ ద్వారా తిలకించారు.

బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే..

“గ్యారంటీ లేని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాడుకునే పాలకులు ఉన్న నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదే. 2019 ఫిబ్రవరి నుండి నేటి వరకు రైతుల ఖాతాల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా జమ చేశారు. ఒక్క విడత కూడా లేట్ చేయలేదు. దేశవ్యాప్తంగా 9 కోట్ల 44 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇయాళ 23వ విడత కింద …. 18 వేల 880 కోట్లు నిధులు విడుదలయ్యాయి. నీతి అయోగ్ లెక్కల అధ్యయనం ప్రకారం సకాలంలో ఈ పైసలను రిలీజ్ చేయడంవల్ల 92 శాతం మంది రైతులు కిసాన్ సమ్మాన్ పైసలను వ్యవసాయ అవసరాలకు అంటే… విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తున్నారని తేలింది. 85 శాతం మంది రైతులు తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. నిజానికి ఇంతకంటే ఏం కావాలి? రైతులకు ఇస్తున్న పైసలు తక్కువే కావొచ్చు… కాని కేంద్రం తనకున్న ఆర్ధిక పరిమితుల మేరకు ఇస్తున్న సొమ్ము 92 శాతం వినియోగం అవుతుందంటే… ఇంతకంటే ఇంకేం కావాలి?

2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ ను ఏకంగా 5 రెట్లు పెంచారు. 11 లక్షల కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి 1 లక్షా 40 వేల 529 కోట్ల రూపాయలు కేటాయించినం. గత ఏడాదితో పోలిస్తే 5 శాతం కేటాయింపులు పెంచాం. కేంద్ర బడ్జెట్ 2026-27లో PM-KISAN కోసమే 60 వేల కోట్ల రూపాయలు కేటాయించారంటే అర్ధం చేసుకోవాలి. 25 కోట్ల మందికి భూసార పరీక్షల కార్డులను అందించారు. రైతుల రుణ పరిమితిని ఈ ఏడాది నుండి 5 లక్షల రూపాయలకు పెంచారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద బీమా కంపెనీల ద్వారా 1 లక్షా 75 వేల కోట్ల పరిహారాన్ని అందించారు.

7 కోట్ల 70 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి 10 లక్షల కోట్ల రూపాయల క్రెడిట్ మద్దతు కల్పించారు. రైతు లక్ష రూపాయల లోన్ తీసుకుంటే… ఏడాదికి వడ్డీతో కలిపి 1 లక్షా 4 వేల చెల్లిస్తే చాలు. మన తెలంగాణలోనూ దాదాపు 40 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులిచ్చి దాదాపు 50 వేల కోట్ల రుణాలను అందించగలిగాం. అంటే విత్తనాలు, ఎరువులు మొదలు వ్యవసాయ యంత్రాలు, పశుసంవర్ధక, పాడి, చేపల పెంపకం దాకా అవసరమైనప్పుడు ఈ కార్డును ఉపయోగించి రుణాలు పొందవచ్చు. ముఖ్యంగా రైతులకు కనీస మద్దతు ధరను యూపీఏ పాలనతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేశారు. 25 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చారు. మన తెలంగాణలో 1 కోటి 10 లక్షల సాయిల్ హెల్త్ కార్డులు అందించారు.

ఎరువుల సబ్సిడీ గురించి చెప్పాల్సిన పని లేదు. బహిరంగ మార్కెట్లో యూరియా బస్తా ధర 2400 నుండి 2700 దాకా ఉంటే సబ్సిడీపై 266 రూపాయలకే అందిస్తున్నారు. అంటే 2200 నుండి 2400 దాకా సబ్సిడీ భరిస్తున్నారు. అట్లాగే డీఏపీ 4 వేల రూపాయలకుపైగా ఉంటే 1360 రూపాయలకే అందిస్తూ 2 300లకు పైగా సబ్సిడీ భరిస్తున్నారు. యూరియా, డీఏపీ, పొటాషియం ఏటా ఒక్కో ఎకరానికి 18 వేల రూపాయలను రైతుకు ఆదా చేస్తున్నారు. ఒక్క ఎరువుల సబ్సీడీ పేరుతోనే మోదీ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.ఎరువుల వా డకంతో పండించిన ఆహార ధాన్యాలను తింటున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

ఎరువుల వాడకంతో పంట దిగుబడివ పెరగడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ రోగాల పేరుతో ఆసుపత్రుల ఖర్చులకే పోతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. ఇకపై ప్రజల శ్రేయస్సు ద్రుష్ట్యా ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు రైతులంతా ప్రక్రుతి వ్యవసాయంవైపు మళ్లాలి. ప్రక్రతి వ్యవసాయం మళ్లితే తొలి పంట ఆదాయం రాకపోయినా, ఆ తరువాత వేసే పంటలన్నీ లాభదాయకంగా మారతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.” అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>