మధిర మున్సిపాలిటీ ఖర్చుల లెక్కల్లో మాయ!

కలం, ​మధిర: ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ (Madhira Municipality) లో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందా? అధికారుల పర్యవేక్షణ కొరవడి బయటి వ్యక్తుల పెత్తనం పెరిగిపోయిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి పనులపై చర్చించాల్సిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం అధికారుల పనితీరు, నిధుల లెక్కలు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం వంటి అంశాలతో వాడీవేడిగా సాగింది. ఖర్చుల లెక్కల్లో ‘మాయ’, పరిపాలనలో ప్రైవేటు వ్యక్తుల ‘ఛాయ’ స్పష్టంగా కనిపిస్తోందంటూ పలువురు కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

​గత నాలుగు నెలల కాలంలోనే మున్సిపాలిటీలో సుమారు రూ.20 లక్షల మేర డీజిల్, పెట్రోల్ ఖర్చు అయినట్లు లెక్కలు చూపడంపై సమావేశంలో తీవ్ర దుమారం రేగింది. ఇంత భారీ మొత్తంలో ఇంధనం ఎక్కడ వినియోగించారు? ఏ వాహనాలకు ఎంత మేర ఖర్చు చేశారు? ఇందుకు సంబంధించిన బిల్లులు, రికార్డులు పారదర్శకంగా ఉన్నాయా? అంటూ కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. డీజిల్, పెట్రోల్ కూపన్ల జారీలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఏమిటని, కూపన్లు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలపై పూర్తి స్థాయి రికార్డులను కౌన్సిల్ ముందుంచి స్పష్టత ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు.

​మరోవైపు మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉండగా, మధ్యలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎందుకు ఉంటోందని సభ్యులు మండిపడ్డారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధం లేని వ్యక్తులకు కీలక వ్యవహారాల్లో ప్రాధాన్యత కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అసలు మున్సిపాలిటీని నడిపిస్తున్నది అధికారులా లేక ప్రైవేటు వ్యక్తులా అనే విషయంపై కమిషనర్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు.

​అలాగే పట్టణంలోని రహదారి డివైడర్లపై ఉన్న మొక్కల కత్తిరింపు, పారిశుద్ధ్య నిర్వహణ పనులకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు చూపడంపై కౌన్సిలర్లు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు, చెల్లించిన నిధులకు పొంతన ఉందా అని ప్రశ్నిస్తూ, పనుల నాణ్యతను పరిశీలించకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారా అనే అంశంపై సమగ్ర వివరాలు వెల్లడించాలని కోరారు. ​మున్సిపాలిటీలో (Madhira Municipality) కీలక నిర్ణయాలు, అభివృద్ధి పనులు, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు స్టాండింగ్ కమిటీల ఏర్పాటు అత్యవసరమని కౌన్సిల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీల ఏర్పాటు ద్వారానే పనులపై పర్యవేక్షణ పెరుగుతుందని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ప్రజాధనంతో నడిచే పురపాలక సంఘంలో ప్రతి రూపాయికి లెక్క ఉండాలని, కౌన్సిలర్లు లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను పట్టణ ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>