భట్టి వ్యూహం.. సీఎం రేవంత్ హామీ.. మధిర విద్యార్థుల దశాబ్దాల కల సాకారం!

కలం, ఖమ్మం బ్యూరో : దశాబ్దాల నిరీక్షణ, వేలాది మంది గ్రామీణ విద్యార్థుల సుదీర్ఘ కల ఎట్టకేలకు సాకారమైంది. ఖమ్మం జిల్లా మధిర (Madhira) నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేయడంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పరిపాలన పరమైన అనుమతులు కూడా చకచకా రావడం వెనుక రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజకీయ చతురత, వ్యూహాత్మక కృషి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

​ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును సాధించాలంటే సరైన సమయం, సరైన వేదిక చాలా ముఖ్యం. మధిర నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 10వ తేదీన చింతకానిలో జరిగిన భారీ బహిరంగ సభను వేదికగా ఎంచుకున్నారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో, నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తును, ఇక్కడి విద్యా అవసరాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముందు ఆయన ఎంతో వ్యూహాత్మకంగా, బలంగా ఉంచారు. సభకు హాజరైన ప్రజల నుంచి వచ్చిన ఉద్వేగభరిత స్పందన, భట్టి విక్రమార్క విజ్ఞప్తిలోని న్యాయాన్ని గమనించిన ముఖ్యమంత్రి, ఆ వేదికపైనే జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి తక్షణమే హామీ ఇచ్చారు.

​సాధారణంగా ప్రభుత్వాల్లో ఒక పెద్ద ప్రకటన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన జీవోలు, అనుమతులు రావడానికి నెలల తరబడి సమయం పడుతుంది. కానీ మధిర జేఎన్‌టీయూ కాలేజీ విషయంలో సీన్ పూర్తిగా భిన్నంగా జరిగింది. చింతకాని సభలో ముఖ్యమంత్రి ప్రకటించి పది రోజులైనా కాకముందే పరిపాలన పరమైన అనుమతులు కూడా మంజూరవడం నిజంగా ఒక సంచలనం. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క స్వయంగా ఈ ఫైలు కదలికలను పర్యవేక్షించడం, అధికారులతో నిరంతరం సమీక్షించడంతోనే ఈ రికార్డు స్థాయి వేగంతో అనుమతులు సాధ్యమయ్యాయి. ఇది ఆయనకు తన సొంత నియోజకవర్గ విద్యాభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.

​మధిర నియోజకవర్గం ప్రధానంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత నేపథ్యం ఉన్న ప్రాంతం. ఇక్కడి పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ చదవాలంటే ఖమ్మం కో, హైదరాబాద్‌ కి, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కి వెళ్లాల్సి వచ్చేది. హాస్టల్ ఖర్చులు, ప్రైవేట్ కాలేజీల భారీ ఫీజులు భరించలేక ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఇప్పుడు మధిరలోనే ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూ ప్రభుత్వ కళాశాల రావడం వల్ల ఉచిత, అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన సాంకేతిక విద్య స్థానిక యువతకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ కళాశాల కావడంతో అత్యుత్తమ ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్ వసతులతో పాటు, భవిష్యత్తులో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవకాశాలు కూడా మెరుగవుతాయి.

​”కల కలగానే మిగలలేదు…” అన్నట్లుగా, మధిర ప్రజలు దశాబ్దాలుగా కంటున్న కల నేడు ప్రభుత్వ జీవో రూపంలో నిజమైంది. నియోజకవర్గ ఆకాంక్షను గుర్తించి పట్టుబట్టి సాధించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తిని మన్నించి తక్షణమే జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి కి మధిర ప్రాంత ప్రజలు, విద్యార్థులు, మేధావులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం మధిర విద్యా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>