కలం, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ (FIFA World Cup) మ్యాచ్ సందర్భంగా కేరళలో ఎలాంటి విద్యుత్ అంతరాయం ఉండదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సన్నీ జోసెఫ్ హామీ ఇచ్చారు. మ్యాచ్‌ను ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. అవసరమైతే అధిక ధర చెల్లించి అయినా విద్యుత్ కొనుగోలు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
తక్కువ వర్షపాతం కారణంగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడం, మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని సన్నీ జోసెఫ్ తెలిపారు. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిన గత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ఆ ఒప్పందం ద్వారా కేరళకు యూనిట్‌కు రూ.4.29 చొప్పున 465 మెగావాట్ల విద్యుత్ లభించేదని, దాన్ని కొనసాగించకపోవడం వల్ల ప్రస్తుతం అదనపు భారం పడుతోందని ఆరోపించారు.
రాత్రి వేళల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు పగలు కూడా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇటీవల 200 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేరళ విద్యుత్ నియంత్రణ కమిషన్ అనుమతి ఇచ్చిందన్నారు. దీనికి సుమారు రూ.850 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు.

