కలం, నిజామాబాద్ బ్యూరో : ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వంటింటి గ్యాస్ టెన్షన్ పెడుతోంది.. కొరత ఏం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో జనాలు మాత్రం గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. గ్యాస్ బుక్ అయిన నాలుగైదు రోజుల వరకూ గ్యాస్ దొరకకపోవడం.. ఇక గ్యాస్ దొరకదేమో అని భావించడం.. బుక్ చేసే సందర్భాల్లో ఎర్రర్ రావడం ఇబ్బందులకు గురి చేస్తుంది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో 33 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు సాధారణ ప్రజల వంట గదుల వరకు చేరిందని చెప్పాలి.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీ, మండలాల్లో సిలిండర్ల కొరత కనపడుతోంది. ప్రజలు ఆన్‌లైన్లో బుకింగ్ చేసుకోవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా సర్వర్ బిజీ వస్తోంది. బుకింగ్ చేసుకున్న 25 రోజులకు సిలిండర్ ఇస్తామని నిర్వాహకులు ఇళ్లకు సిలిండర్ ను సరఫరా చేయడం లేదు.. మరోపక్క హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ పాయింట్ యజమానులు ఒక్కో కమర్షియల్ సిలిండర్ కు అదనంగా 500 నుంచి 800 అలాగే గృహ అవసరాలకు ఒక్కో సిలిండర్ బ్లాక్ లో 500 వరకు అదనంగా ఏజెన్సీ నిర్వాహకులు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల బార్డర్ మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన హోటళ్ల నిర్వాహకులు బిచ్కుంద, మద్నూర్, పిట్లంలో కొందరిని మధ్యవర్తులుగా పెట్టుకొని డీలర్ల నుంచి ఇళ్లకు వాడే సిలిండర్లు తీసుకొని కమీషన్ పై మహారాష్ట్రలోని దెగ్లూర్ తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిలిండర్లు మహారాష్ట్ర తరలి పోతున్నాయని ప్రజలు అంటున్నారు. 20 ఏళ్ల కింద హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేసేవారు. టీ హోటళ్లలో బొగ్గులతో మంట పెట్టి టీ, కాఫీలు తయారు చేసేవారు. వాటి బదులు ఇప్పుడు సిలిండర్లు వాడుతున్నారు.. ప్రస్తుతం సిలిండర్ల కొరత ఉండటంతో ఆయా మండలాల్లో టీ పాయింట్ నిర్వాహకులు బొగ్గు వాడుతున్నారు. మరి కొందరు కరెంటుతో నడిచే ఇండెక్షన్ స్టౌవ్ లు వాడుతున్నారు. మరో వారం రోజులలో సిలిండర్ల కొరత కొనసాగితే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేయాల్సి వస్తుంది. ఉపాధి కోల్పోతామని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు..
ఏజెన్సీల వద్ద బారులు..
ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం వంట గ్యాస్ పై పడింది. ఆన్ లైన్ లో గ్యాస్ బుక్ కాకపోవడం, బుకింగ్ కు నిబంధనలను విధిస్తుండడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతున్నాయి. సర్వర్ బిజీ కారణంగా గ్యాస్ బుక్ కాకపోవడం తో నిజామాబాద్ లోని గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరుతున్నారు. కమర్షియల్ సిలిండర్లు లభించకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గుల పొయ్యిలు తెచ్చుకొని వంటలు చేస్తున్నారు..
కామారెడ్డి జిల్లాలో..
అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కామారెడ్డి జిల్లాలోనూ గ్యాస్ సరఫరాపై ప్రభావం కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచేసింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 60 పెంచడంతో రూ.927 రూపాయలనుంచి రూ. 987 కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరగడంతో రూ.2,028 నుంచి రూ. 2,143 అయింది. జిల్లాలో గృహ వినియోగం కోసం ప్రతి నెలా దాదాపు 1,75 వేల వరకు సిలిండర్లు అవసరం అవుతాయి. సిలిండర్ ధర రూ. 60 పెరగడంతో జిల్లావాసులపై రూ. 1.05 కోట్ల భారం పడనుంది. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయి గ్యాస్ కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో అవసరం లేకున్నా చాలామంది వినియోగదారులు అదనపు సిలిండర్ ను రిఫిల్ చేయించుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్ మండల కేంద్రాలలో అక్రమంగా నిల్వ ఉంచిన వంటగ్యాస్ సిలిండర్లను పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్, రెవెన్యూ, అధికారులు తెలిపారు. బీర్కూర్ లో పది సిలిండర్లను స్వాధీనం చేసుకుని ఐదు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. వీటిని గ్యాస్ ఏజెన్సీకి తరలించి కస్టోడియన్ రసీదులు తీసుకున్నామని తెలిపారు. అలాగే బాన్సువాడ పట్టణంలోని పలు హోటళ్లు, టీ స్టాల్ లలో అక్రమంగా నిల్వ చేసిన ఏడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

