నల్లగొండలో గ్యాస్ ‘గోస’!

కలం, నల్లగొండ బ్యూరో: గ్యాస్ బుక్ చేసి నాలుగు రోజులైనా అడ్రస్ లేదు. ఫోన్ చేస్తే ఎత్తరు, ఏజెన్సీకి వెళ్తే సమాధానం చెప్పరు. హోటల్ నుంచి తెచ్చుకుని తిందామంటే అక్కడ ధరలు భయంకరంగా ఉన్నాయి. ఇంట్లో వండుకుందామంటే గ్యాస్ రాదు. అదే హోటళ్లలో చూస్తే ఇంటికి వాడాల్సిన సిలిండర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మా కడుపు కొట్టి వాళ్లు వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఇదీ ఓ సామాన్యుడి ఆవేదన.

ఒకవైపు ఆకాశాన్నంటుతున్న ధరలు.. మరోవైపు అడుగడుగునా అక్రమ దందాలు.. సామాన్యుడి వంటింట్లో మంట పుట్టించాల్సిన గ్యాస్.. నేడు కన్నీళ్లు తెప్పిస్తోంది. గ్యాస్ బుక్ చేసి వారం దాటినా సిలిండర్ ఇంటికి రాదు కానీ, అదే ఏజెన్సీ నుంచి అడ్డదారిలో హోటళ్లకు మాత్రం కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి. దీంతో నల్లగొండ (Nalgonda) జిల్లాలో సామాన్యుడి పరిస్థితి పొయ్యి వెలగదు.. ఆకలి తీరదు అన్నట్లుగా తయారయ్యింది. ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు అరిగోస పడుతున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ మాత్రం గ్యాస్ సరఫరాకు ఏ ఇబ్బందీ లేదని చెబుతుండడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నల్లగొండ (Nalgonda) జిల్లాలో దాదాపు 5.5 లక్షల కనెక్షన్లు ఉండగా, సూర్యాపేటలో 4.06 లక్షల కనెక్షన్లు, యాదాద్రి భువనగిరిలో దాదాపు 3.5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇక గ్యాస్ సరఫరా కోసం దాదాపు 110 ఏజెన్సీల వరకు ఉన్నాయి.

పనిచేయని బుకింగ్స్.. అందని సిలిండర్లు

గ్యాస్ బుక్ చేసుకుంటే 24 గంటల్లో ఇంటికి రావాల్సిన సిలిండర్.. వారం రోజులు దాటినా అడ్రస్ లేకుండా పోతోంది. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ తరచూ మొరాయిస్తుండటంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ‘నాలుగు రోజుల కిందట బుక్ చేశాం.. ఇంకా రాలేదు’ అని అడిగితే.. ‘స్టాక్ లేదు’ అనే సమాధానం ఏజెన్సీల నుంచి ఎదురవుతోంది. కానీ అదే సమయంలో తెర వెనుక మరో దందా నడుస్తోంది. సామాన్యులకు అందాల్సిన రాయితీ (డొమెస్టిక్) సిలిండర్లు అక్రమ మార్గంలో వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు తరలుతున్నాయి. ఇంటి అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను ఏజెన్సీలు అధిక ధరలకు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, క్యాంటీన్లకు విక్రయిస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా డొమెస్టిక్ కస్టమర్లకు అందాల్సిన కోటా తగ్గిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

Read Also: ఉరి వేసుకున్న భార్య .. వీడియో తీస్తూ సూచనలిచ్చిన భర్త !

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>