కలం, ఖమ్మం బ్యూరో: విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై డి. అనంతరాములు కుటుంబ సభ్యులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam CP Sunil Dutt) ఆర్థిక సహాయం అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష విలువైన చెక్కును మంగళవారం నాడు వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేసి పరామర్శించారు. విధి నిర్వహణలో భాగంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఏడాది ఆగస్టు 23న అనంతరాములు మరణించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవడం పోలీస్ శాఖ ప్రథమ బాధ్యత అని పేర్కొన్నారు. సిబ్బంది సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని విధమైన సహాయ సహకారాలు అందించడానికి శాఖ తరపున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో కళావతి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

