కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తుతున్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలపై ప్రజలకు, రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి ఆయన సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే యాసంగి సీజన్లో సాగునీటి లభ్యత ఉండే అవకాశం లేనందున రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు తదితర తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రెండో పంట సాగు చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని నీటిని యాసంగి పంటలకు విడుదల చేయకుండా కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో పాత తాగునీటి పథకాలను పునరుద్ధరించడంతో పాటు, లీకేజీలను అరికట్టి నీటి వృథాను నివారించాలన్నారు.
గ్రామాల్లో ఇంకుడు గుంతలు, బోరు రీచార్జి గుంతలు, వ్యవసాయ కుంటలు వంటి నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. అలాగే, పశుగ్రాసం కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్ వృథాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా భూగర్భ జలాల తగ్గుదలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తదితర ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

