కలం, నల్లగొండ బ్యూరో: నల్గొండ (Nalgonda) జిల్లాలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చుతోంది. గత రెండు మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా వాహనాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ హైవేల మీదుగా వస్తుండటంతో ఇక్కడ స్టాక్ త్వరగా అయిపోతోంది. బంకు నిర్వాహకులు ముందుగానే లక్షలాది రూపాయలు అడ్వాన్స్ చెల్లించినప్పటికీ, మూడు నాలుగు రోజులు గడుస్తున్నా స్టాక్ అందడం లేదని వాపోతున్నారు.
ఒకవేళ ట్యాంకర్ వచ్చినా.. పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఒక్క రోజులోనే ఖాళీ అవుతోందని అంటున్నారు. ప్రస్తుతం వరి కోతల సీజన్ కావడంతో హార్వెస్టర్ల కోసం వందల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. డీజిల్ దొరకకపోవడంతో పొలాల్లోనే కోతలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఏపీ నుంచి వచ్చే వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్ ప్రాంతాల్లో ట్యాంకులు ఫుల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి డీజిల్ కొరత ఎక్కువగా ఉందని, పెట్రోల్ కొంతవరకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే రెండు మూడు రోజుల్లో పెట్రోల్ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని బంకు నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.

