కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని మండలం పొట్టిగుట్ట తండా (Pottigutta Thanda) లో జంట హత్యలు చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. చందూర్ మండలం మేడిపల్లి తండాకు చెందిన లకావత్ ఆనంద్, వర్ని మండలం పొట్టిగుట్ట తండాకు చెందిన పాత్లోత్ కవిత గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కవిత భర్త మరణించిన తర్వాత ఆనంద్‌తో పరిచయం ఏర్పడి కలిసి జీవనం కొనసాగించారు.
ఇటీవల కవిత తన కుమార్తె భవిష్యత్తు కారణంగా ఆనంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఆనంద్ మనస్తాపానికి గురై, పొట్టిగుట్ట తండాలో కవితపై పారతో దాడి చేశాడు. ఈ దాడిలో కవిత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆగ్రహించిన కవిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనంద్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆనంద్‌ను అంబులెన్స్‌లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

