Mobile Popup Ad
Mobile Popup Ad

కరెంట్ కనెక్షన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి

కలం, భువనగిరి : వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఓ రైతు నుండి లంచం తీసుకుంటుండగా టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ లైన్‌మెన్ (ఏఎల్ఎం) శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ACB) రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా మోటకొండూర్ పరిధిలో వెలుగుచూసింది. ఏసీబీ నల్లగొండ రేంజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌లో టీజీఎస్పీడీసీఎల్‌లో పప్పుల రమేశ్ అసిస్టెంట్ లైన్‌మెన్‌‌గా పనిచేస్తున్నాడు. ఒక బాధిత రైతు పొలంలో విద్యుత్ స్తంభాలు వేసి, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి వ్యవసాయ బోరుబావులకు కరెంట్ కనెక్షన్ ఇచ్చేందుకు గాను రూ. 35వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత రైతు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో శనివారం నిందితుడు పప్పుల రమేశ్ బాధితుడి నుండి లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్ము రూ. 35వేలు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుని తన విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన అసిస్టెంట్ లైన్‌మెన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తదుపరి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్ నాంపల్లిలోని ఒకటో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>