కలం, నిర్మల్: జిల్లాలోని (Nirmal) పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో పిడుగు పడటంతో సమీపంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి భయాందోళనకు గురయ్యారు. పిడుగు ప్రభావంతో కొబ్బరి చెట్టులో మంటలు వ్యాపించాయి.
భారీ ఉరుములు, మెరుపుల మధ్య అకస్మాత్తుగా పిడుగు పడటంతో గ్రామస్తులు ఏం జరిగిందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. అనంతరం చెట్టుకు మంటలు అంటుకున్న దృశ్యం స్థానికులను మరింత భయపెట్టింది. ఇంత భారీ పిడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. పిడుగు పడిన సమయంలో చెట్టు కింద ఎవరైనా ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.

