ఎల్‌ఐసీ ఉద్యోగుల మహాసభలో కీలక డిమాండ్లు

కలం, కరీంనగర్ బ్యూరో: ఎల్‌ఐసీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి, జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. కరీంనగర్‌లో(Karimnagar) జరిగిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (LIC Employees Union) 30వ డివిజన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 70 ఏళ్లుగా దేశంలోని కోట్లాది మందికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తూ భరోసా అందిస్తున్న ఎల్‌ఐసీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, కార్మిక హక్కులపై కోత వంటి చర్యలతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల మద్దతుతో విస్తృత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఎల్‌ఐసీలో ప్రభుత్వం పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడిపై గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,200 కోట్ల డివిడెండ్ చెల్లించిందని, అలాంటి సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 7.8 శాతం జీడీపీ వృద్ధి సామాన్య ప్రజల జీవితాల్లో ప్రతిఫలించడం లేదని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల్లో 80 శాతానికి పైగా సభ్యత్వం కలిగిన తమ యూనియన్‌కు వెంటనే గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్‌ఐసీలో తక్షణమే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కోరారు.

యూనియన్ జోనల్ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వెనుక ఆర్థిక కారణాలు ఉన్నాయని అన్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాల ఒత్తిడితో బీమా రంగంలో తీసుకువస్తున్న పలు సంస్కరణలు ఎల్‌ఐసీని బలహీనపరిచేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మహాసభలకు ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్, సేల్స్ మేనేజర్ హరికృష్ణ, మేనేజర్ కృష్ణ, క్లాస్-1 అధికారుల సంఘం నాయకులు రవీందర్, వికాసాధికారుల సంఘం నాయకులు వాసుదేవ రెడ్డి, పెన్షనర్స్ సంఘం నాయకులు రామయ్య, లక్ష్మీకాంతం, యూఎఫ్‌బీయూ నాయకులు దామోదర్, ఏజెంట్ల సంఘం నాయకులు ప్రభాకర్ రావు, గట్టు రాజయ్య, విద్యుత్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి తదితరులు హాజరై మహాసభలకు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

భోజన విరామం అనంతరం జరిగిన సమావేశంలో 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వామన్ రావు, ఉపాధ్యక్షురాలిగా సూర్యకళ, ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ రావు, సంయుక్త కార్యదర్శులుగా బసవేశ్వర్, అనుపమ, శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీలత ఎన్నికయ్యారు. మహాసభల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 13 శాఖలతో పాటు కరీంనగర్ బ్రాంచ్-1, బ్రాంచ్-2, డివిజనల్ యూనిట్‌లకు చెందిన నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>