అయ్యవారిపల్లిలో న్యాయ అవగాహన.. ఉచిత వైద్య శిబిరం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేయడమే లక్ష్యమని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఎన్. ప్రేమలత అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి (Ayyavaripalli) గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనల మేరకు అయ్యవారిపల్లి గ్రామాన్ని మెగా డ్రైవ్‌లో భాగంగా ఎంపిక చేసి ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తించేందుకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి, నివేదికలను సంబంధిత శాఖలకు పంపనున్నట్లు చెప్పారు. పేదరిక నిర్మూలనకు గ్రామంలో చేపట్టాల్సిన చర్యలను చట్టపరంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు చిన్నచిన్న సమస్యలకు గొడవలకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. పారా లీగల్ వాలంటీర్లు గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి, సాధ్యమైన మేరకు ప్రాథమిక దశలోనే పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి. ఇందిర మాట్లాడుతూ ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి, జిల్లా జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

అయ్యవారిపల్లిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా, జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు, చికిత్సలు అందించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా జడ్జి ఎన్. ప్రేమలత వైద్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే యూడీఐడీ కార్డులు, లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ఆంజనేయులు, నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి మహమ్మద్ ఆఫ్రోజ్ అక్తర్, ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ కీర్తన, జిల్లా సంక్షేమ అధికారి జరిన బేగం, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, గ్రామ సర్పంచ్ వాగ్య రాము నాయక్, చైల్డ్‌లైన్ ప్రతినిధి చంద్రశేఖర్, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>