కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయనున్న చేయూత సామాజిక భద్రతా (ఆసరా) పింఛన్ల (Aasara Pensions) పంపిణీకి రంగం సిద్ధం చేసింది. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను ఈ నెల 11వ తేదీలోగా 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపీడీవోలు, డీఎల్ఎంవోలు, ఎక్సైజ్, చేనేత జౌళి శాఖలు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల స్థాయిల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిశీలించి ఆమోదించాలని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్ల మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేయాలని సూచించింది.
4.50 లక్షల మంది అర్హులు
కొత్త పింఛన్ల కోసం మొత్తం 5,98,193 మంది దరఖాస్తు చేసుకోగా, 4.50 లక్షల మంది అర్హుల జాబితా సిద్ధమైంది. ప్రభుత్వం తొలుత 2.25 లక్షల పింఛన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యర్థనలు రావడంతో అదనంగా మరో 2.25 లక్షల పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ఏటా రూ.544.32 కోట్ల అదనపు భారం పడనున్నది.
నియోజకవర్గాల వారీగా పంపిణీ
కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని సెర్ప్ ఆదేశించింది. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులతో సంప్రదించి డిస్ట్రిక్ యంత్రాంగం షెడ్యూల్ను ఖరారు చేయాలని పేర్కొంది.
అభ్యంతరాలు, అప్పీళ్లకు చాన్స్
పింఛన్ల (Aasara Pensions) కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి పరిష్కరించేందుకు పంపిణీ వేదికల వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. చేయూత పింఛన్ దరఖాస్తుదారుల నుంచి వచ్చే అప్పీళ్లను స్వీకరించి, సమస్యలను పరిష్కరించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సర్క్యులర్లో స్పష్టం చేశారు.
కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రక్రియ
దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, మంజూరు ఉత్తర్వుల జారీ, పంపిణీ కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించాలని సెర్ప్ సూచించింది. నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులకు ఆమోదం లభించేలా చూడటంతో పాటు మంజూరు పత్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది.

