కలం, వెబ్ డెస్క్: వారసత్వ ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. తాతకు సంబంధించిన ఆస్తి దానంతట అదే మనవడికి సంక్రమించదని స్పష్టం చేసింది. తాత తన ఆస్తిని పిల్లలకు పంచిన తర్వాత, ఆస్తిపై సంబంధిత వారసులకే పూర్తి హక్కులు ఉంటాయని, తండ్రికి సంక్రమించిన వాటాపై మనవడికి పుట్టుకతో వచ్చే హక్కు ఉండదని వెల్లడించింది. వంశపారంపర్య ఆస్తి, వ్యక్తిగత ఆస్తి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
చెన్నైలోని 1,811 చదరపు అడుగుల ఆస్తిలో సగం వాటా కావాలని తల్లి సంరక్షణలో ఉన్న ఓ మైనర్ బాలుడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఆ ఆస్తి అతడి తాతకు చెందినదని.. ఈ క్రమంలో తండ్రి తన వాటాను విక్రయించగా, అందులో తనకు కూడా హక్కు ఉందంటూ బాలుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే, బాలుడి వాదనను సుప్రీంకోర్టు ధర్మానం తోసిపుచ్చింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం తాత మరణానంతరం తండ్రికి సంక్రమించిన ఆస్తి, ఆయన వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందని తెలిపింది.
ఇలాంటి ఆస్తిపై కుమారుడికి పుట్టుకతో సహభాగస్వామ్య హక్కు ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది. వంశపారంపర్య ఆస్తిలో కుమారుడికి జన్మతః హక్కు ఉంటుందని, అయితే వారసత్వంగా తండ్రికి వచ్చిన ఆస్తిపై అలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో తాత ఆస్తి, తండ్రికి సంక్రమించిన తర్వాత మనవడికి ఎలాంటి హక్కులు ఉంటాయనే అంశంపై అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టత ఇచ్చినట్లయింది.

