కలం, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలించే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL Liquor) రవాణా, అక్రమ డిఫెన్స్ మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఏటా ఎన్డీపీఎల్ కేసులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో 935 కేసులు నమోదు కాగా, 2025లో 1,251 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 896 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తక్కువకు కొని.. ఎక్కువకు సేల్
2024లో 9,459 లీటర్లు, 2025లో 11,078 లీటర్లు, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 8,655 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా గోవా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, అహ్మదాబాద్ ప్రాంతాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి మద్యం తీసుకురావడానికి అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో చెక్ పోస్టులతో పకడ్బందీ నిఘా
పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎన్డీపీఎల్ కట్టడికి అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. ఎక్సైజ్ ఆదాయానికి గండికొడుతూ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జైలు శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాహనాల తనిఖీలతో పాటు విశ్వసనీయ సమాచారంతో వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని సీజ్ చేస్తున్నామని, పట్టుబడిన మద్యం బాటిళ్లను ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

