జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలి: తక్కళ్లపల్లి

కలం, హనుమకొండ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, అక్రమంగా తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ (Hanumakonda) కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా (Left Parties Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా అర్హులైన పేదలు, సామాన్యుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, వివాదాస్పదంగా మారిన ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసే వరకు వామపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తాయని తెలిపారు.

ధర్నాకు సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులతో పాటు సీపీఎం నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>