Mobile Popup Ad
Mobile Popup Ad

లడఖ్ సరికొత్త అధ్యాయం: 5 జిల్లాల ఏర్పాటుకు ఆమోదం

కలం, వెబ్‌ డెస్క్ : లడఖ్ (Ladakh) కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను నెరవేరుస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లడఖ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య ప్రస్తుతమున్న రెండు నుండి ఏడుకు చేరుకుంది.

కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నుబ్రా, షామ్, చాంగ్‌తాంగ్, జాన్స్కర్, ద్రాస్ ఉన్నాయి. ఈ విభజన ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరిగి, మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆగస్టు 2024లో అమోదం పొంది.. ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

ఈ నూతన జిల్లాల ఏర్పాటు వల్ల క్షేత్రస్థాయిలో పాలన మరింత బలోపేతం కావడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. లడఖ్‌ (Ladakh)ను ఆర్థికంగా, సామాజికంగా మరింత శక్తివంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ఈ అడుగు ఎంతో కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి పౌరుడికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరడమే తమ లక్ష్యమని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>