భువనగిరిలో ఘనంగా మెగా జాబ్ మేళా

కలం, భువనగిరి: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కుంభం ఫౌండేషన్ (Kumbam Foundation), 1ఎం1బీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భువనగిరి (Bhuvanagiri) పట్టణంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా విజయవంతంగా కొనసాగుతోంది. గత రెండు రోజులుగా అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్షలు, టోకెన్ల కేటాయింపు ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేయగా ఆదివారం ఇంటర్వ్యూల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, అర్హత సాధించిన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. యువత ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. “ఉద్యోగం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, అనుభవం సంపాదించడం ముఖ్యం. నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు” అని ఆయన సూచించారు. యువత సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కుంభం ఫౌండేషన్ చైర్ పర్సన్ కుంభం కీర్తి రెడ్డిని, వాలంటీర్లను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భువనగిరి యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రత్యేక ‘స్కిల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఐబీఎం ప్రతినిధులను కోరారు. దీనిపై ఐబీఎం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు వారి సొంత ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కుంభం ఫౌండేషన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐబీఎం అసోసియేట్ డైరెక్టర్ ప్రసన్న నోరి, డైరెక్టర్ అభిరామ్, దీపికా వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, వాలంటీర్లు, పెద్ద ఎత్తున ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>