Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో కుడా పెట్టుబడి.. రైతుకు రాబడి

కలం, వరంగల్ బ్యూరో: ఓరుగల్లును అభివృద్ధి చేసే దిశగా కుడా (KUDA)  (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నగర శివారులో పెద్దఎత్తున ల్యాండ్ పూలింగ్ చేపడుతోంది. రైతుల అంగీకారంతో వారి భూములను వెంచర్లు‌గా మార్చి వేలం ద్వారా విక్రయిస్తోంది. రైతులతో ఒప్పందం మేరకు వారికి డబ్బులు చెల్లించి మిగతా డబ్బులను అభివృద్ధి పనులకు ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మెజారిటీ రైతులు వారి భూములు కుడాకు అప్పగించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 145 ఎకరాలు సేకరించిన కుడా వెంచర్లు చేసి విక్రయించగా రైతులు లాభాల బాట పట్టారు. దీంతో మరి కొంతమంది రైతులు సుమారు 245 ఎకరాల భూమిని కుడా కు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ భూములను వెంచర్లు చేసి, విక్రయించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

కుడా పెట్టుబడి.. రైతులకు రాబడి

కుడా ల్యాండ్ ఓనర్ల అంగీకారంతో పట్టా భూములను లేఅవుట్ చేసి వెంచర్లుగా డెవలప్ చేస్తోంది. వరంగల్, కాజీపేట, హనుమకొండ చుట్టుపక్కల గల ఆత్మకూరు, ఆరెపల్లి, ఎల్కతుర్తి, ఉనికిచర్ల రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసుకుని ఆయా భూములను లే అవుట్ చేస్తోంది. ఇక్కడ భూములకు విపరీతంగా డిమాండ్ ఉంది. గజం స్థలం రూ, 25 వేల నుంచి రూ. 50 వేల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో భూమి ఇచ్చిన రైతుకు డెవలపయిన లేఅవుట్‌లో రెసిడెన్షియల్ ప్లాట్ లేదా దానికి సరిపోయే డబ్బులు అందజేస్తున్నారు. రోడ్లు, పార్క్ పోను మిగిలిన భూమిని కుడా అధికారులు బహిరంగ వేలం ద్వారా ప్లాట్లుగా అమ్ముతోంది.

వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు

కుడా మాస్టర్ ప్లాన్-2041 మేరకు వరంగల్ నగరాన్ని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ విధానం అమలు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎంపిక చేసిన శివారు గ్రామాల రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోంది. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తోంది. కుడాకు వచ్చే ఆదాయంలో 80 శాతం విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. మిగతా 20 శాతం ఫండ్స్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అబివృద్ది పనులకు వినియోగించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కుడా ప్రధానంగా గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నగర పరిధిలో అవకాశం ఉన్న ప్రాంతాల్లో 100 అడుగుల రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పార్కులు, జంక్షన్ డెవలప్‌మెంట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేగాకుండా మామునూరు ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్‌ నిర్మాణం కోసం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ రన్ వే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు కుడా పరిధిలో గల వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో లింక్ రోడ్లు, మార్కెట్ యార్డులు అభివృద్ధి కోసం చర్యలు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>