కలం, నిర్మల్: మామడ (Mamada) మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఓ గిరిజన గూడెం ఉంది. అదే మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు.. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా అదే పరిస్థితి. ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు.
ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేజ్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. “ఇప్పటి వరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్‌పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

