ఫైనల్‌‌కు ప్రీతి పవార్.. భారత్‌కు పతకం ఖాయం

కలం, స్పోర్ట్స్ : భారత బాక్సింగ్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల 54 కిలోల బాక్సింగ్ విభాగంలో భారత స్టార్ బాక్సర్ (Indian Boxer) ప్రీతి పవార్ (Preeti Pawar) ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్వాపే పై 5-0తో ఘన విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌లో  ప్రీతి కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనుంది. కీలక పోరుకు ముందు తన సన్నాహకాల గురించి మాట్లాడిన ప్రీతి.. బరువు తగ్గడం చాలా కష్టమైన ప్రక్రియ అని తెలిపింది. ముఖ్యమైన పోటీల ముందు ఆహార నియంత్రణ పాటించాల్సి ఉంటుందని, అయితే అదే తనను మరింత కష్టపడేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది.

టోర్నీ ప్రారంభం నుంచే ప్రీతి అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రౌండ్ ఆఫ్ 16లో మలావీ బాక్సర్ ఎంటెంజేపై రెండో రౌండ్‌లోనే విజయం సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన నికోల్ క్లైడ్‌ను ఏకగ్రీవ నిర్ణయంతో ఓడించింది. సెమీఫైనల్‌లో  తొలి దశలో పోరు ఉత్కంఠగా సాగినప్పటికీ.. ఆ తర్వాత ప్రీతి తన ఆటపై పూర్తి పట్టు సాధించింది. వేగవంతమైన జ్యాబ్‌లు, కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. కేథరిన్‌కు వరుసగా మూడు స్టాండింగ్ ఎయిట్ కౌంట్‌లు రావడంతో ప్రీతి ఆధిపత్యం స్పష్టమైంది.

ఈ విజయంతో ప్రీతికి కనీసం రజత పతకం ఖాయమైంది. అయితే తన లక్ష్యం స్వర్ణమేనని ఆమె స్పష్టం చేసింది. ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి దేశానికి బంగారు పతకం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తన విజయ ప్రయాణంలో భారత సైన్యం, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI), సాయ్ (SAI), జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ అందిస్తున్న మద్దతుకు ప్రీతి కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది భారత సైన్యంలో జూనియర్ కమిషన్‌డ్  ఆఫీసర్‌గా నేరుగా ఎంపికైన తొలి మహిళా క్రీడాకారిణిగా ప్రీతి పవార్ గుర్తింపు పొందింది. తన ప్రదర్శనతో దేశ ప్రజలు, సైనికులు గర్వపడేలా కృషి చేస్తానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముందున్న లక్ష్యం ఒక్కటే.. ఫైనల్‌లో  స్వర్ణ పతకం సాధించడం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>