కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్ నినో కారణంగా ఏర్పడిన పంట నష్టం, కరువు (Telangana Drought) పరిస్థితులపై కేంద్రం నుంచి 10 మందితో కూడిన కరువు అధ్యయనం బృందం ఆదివారం హైదరాబాద్ రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ స్టడీ చేసి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ ఫ్రాంక్లిన్ ఖోబంగ్ నేతృత్వంలోని ఈ టీమ్ ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేయనున్నది.
రాష్ట్రంలో మొత్తం 365 మండలాల్లో కరువు నెలకొన్నదని, ఇందులో 111 మండలాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నదని కేంద్రానికి నివేదించింది. పంట నష్టం, పశు నష్టం, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, పశుగ్రాసం అందుబాటులో ఉంచడం.. ఇలాంటి అవసరాలకు సుమారు రూ.20 వేల కోట్లు అవసరమని కేంద్రానికి నివేదించింది. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువుపై రాష్ట్ర కేబినెట్ చర్చించడంతో పాటు అఖిలపక్ష సమావేశాన్ని సైతం నిర్వహించి తాజా పరిస్థితులపై అధ్యయనం చేసింది. ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్రానికి లేఖ రాసింది.
కేంద్రం నుంచి మార్గదర్శకాలు
రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అధ్యయన బృందాన్ని పంపేందుకు నిర్ణయించింది.పలు విభాగాలతో చర్చించిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ బృంద సభ్యులను ఖరారు చేసింది. బృందం పర్యటన, క్షేత్రస్థాయి అధ్యయనం, రాష్ట్రం సమర్పించిన నివేదికపై గురువారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అధ్యయన విధానంపై రాష్ట్ర అధికారులకు కేంద్ర వ్యవసాయ శాఖ పలు మార్గదర్శకాలు ఇచ్చింది. బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పర్యటించాలి, ఏ అంశాలు పరిశీలించాలి అనేదానిపై అధికారులతో చర్చించింది.
కేంద్ర హోంశాఖకు నివేదిక
ఎల్ నినో కారణంగా నెలకొన్న కరువు, ఇప్పటివరకు వివిధ రూపాల్లో జరిగిన నష్టాన్ని ఈ బృందం అంచనా వేయనున్నది. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించనున్నది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి, ఫీల్డ్ విజిట్ సందర్భంగా చేసిన పరిశీలన, ఈ కమిటీ సిఫారసు చేసిన అంశాలు, చివరకు తెలంగాణకు ఎంత ఆర్థిక సాయం చేయాలనేది ఖరారు కానున్నది.
సెంట్రల్ టీమ్ సభ్యులు వీరే..
ఫ్రాంక్లిన్ ఖోబంగ్ – కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ
మహేశ్ కుమార్ – కేంద్ర ఎక్స్ పెండిచర్ డిపార్టుమెంట్ జాయింట్ డైరెక్టర్
అనురాధ బటానా – నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్
అళగు వర్షిణి – కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్
కె.శంకర్ – కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ డైరెక్టర్ (జలసంఘం డైరెక్టర్ కూడా)
ప్రదీప్ కుమార్ – కేంద్ర పౌర సరఫరాల శాఖ అండర్ సెక్రటరీ
విజయ్ థాకరే – కేంద్ర పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్
డాక్టర్ కే పొన్నుస్వామి – కేంద్ర వ్యవసాయ శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్
డాక్టర్ ప్రదీప్ కుమార్ – కేంద్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
పేరు ఖరారు కావాలి – కేంద్ర డ్రింకింగ్ వాటర్ డిపార్టుమెంటు తరఫున
రాష్ట్రంలోని ఎల్ నినో కరువుపై కీలక ఘట్టాలు
జులై 17: రాష్ట్ర కేబినెట్లో చర్చ, కేంద్ర బృందాన్ని పంపేలా లేఖ రాయాలని నిర్ణయం
జులై 18: రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ (ఇప్పుడు మాజీ) చిన్నారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు
సెప్టెంబర్ 18: ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై రూ. 20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోరుతో తీర్మానం ఆమోదం
అక్టోబర్ 1 : కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సమర్పించాలని, ఆల్-పార్టీ మీటింగ్ నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం
అక్టోబర్ 10: ఎల్ నినో, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష, వివిధ డిపార్టుమెంట్లు యాక్షన్ ప్లాన్ తయారుచేయాలని ఆదేశం
అక్టోబర్ 15: ఎల్ నినో ప్రభావాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని, రబీలో వరి సాగును వాయిదా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పీల్
అక్టోబర్ 19: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ (మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి సభ్యులు)
అక్టోబర్ 23: రాష్ట్రంలో 358 మండలాల్లో కరువు నెలకొన్నదని ప్రకటించి అక్టోబర్ 31లోగా మొత్తం ప్రభావిత మండలాలను గుర్తించాలని, డిపార్ట్మెంట్లన్నీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో నిర్ణయం
అక్టోబర్ 24: రాష్ట్రంలో మొత్తం 365 కరువు మండలాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో నంబర్ 3) జారీ
అక్టోబర్ 28: ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలు, రాష్ట్రంలోని ఎల్ నినో పరిస్థితులపై డిప్యూటీ సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
అక్టోబర్ 28: అఖిలపక్ష సమావేశం జరిగిన వెంటనే అదే రోజు రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక

