మళ్లీ టీఆర్ఎస్… కేటీఆర్ మాటల వెనుక మర్మమేమిటి?

కలం, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారాక చాలా కోల్పోయాం.. మళ్లీ టీఆర్ఎస్‌గానే ఉండాలనుకుంటున్నాం.. అని మంచిర్యాలలో ఆదివారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ (KTR) కామెంట్ చేశారు. “మళ్లీ మాదే అధికారం.. ఇప్పుడున్న బీఆర్ఎస్ ఇకపై టీఆర్ఎస్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.. మాకు వేరే పార్టీలతో పొత్తులు కలిసి రావు… రానున్న కాలంలో బీజేపీతో ఎలాంటి పొత్తులూ ఉండవ్.. ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర మొదలుపెడతా.. గడచిన పదేండ్ల పాలనలో ప్రజలతో మాకు దూరం పెరిగింది..” అని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తూ.. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో కేటీఆర్ కామెంట్ చేయడం వెనక మర్మమేంటనేది చర్చకు దారితీసింది.

మళ్లీ టీఆర్ఎస్ పేరు తప్పదా? :

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టి.. తెలంగాణ ఏర్పడ్డాక రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్ఎస్‌కు ఆ పేరు ఓ సెంటిమెంట్. ఢిల్లీ కోట మీద కూడా జెండా ఎగురవేస్తామని ఆశలు పెట్టుకున్న కేసీఆర్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా 2022 అక్టోబర్ 5న అధికారికంగా మార్చారు. కొత్త పేరుతో ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలా ఇతర రాష్ట్రాలను చుట్టివచ్చారు. కానీ 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర తప్పలేదు. అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కూడా రావడం లేదు. అధికారం పోవడానికి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడమే కారణమన్న వాదన పార్టీ నేతల్లో బలంగానే వినిపించింది. మార్చాలన్న ఒత్తిడి కూడా పెరిగింది. అది అయ్యే పని కాదన్న గులాబీ నేతలూ ఉన్నారు. ఈ చర్చల మధ్యలో త్వరలోనే టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం ఉందంటూ కార్యకర్తలు కోరుకుంటున్నారని కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించడం గమనార్హం.

కవిత కామెంట్లతోనే కేటీఆర్ స్పందన? :

టీఆర్ఎస్‌ను (TRS) బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు కేసీఆర్ సహా పార్టీ నేతలు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొందరు నేతలైతే అప్పట్లో వచ్చిన దసరాకు ఏకంగా జనానికి కోళ్లు, మద్యం బాటిళ్ళను పంచిపెట్టారు. తర్వాత దేశమంతా హల్ చల్ చేశారు. పార్టీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక ఏ హడావిడీ లేదు. బీఆర్ఎస్‌ (BRS) నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కూతురు కవిత సైతం బీఆర్ఎస్ పేరు పెట్టడం వల్లనే పార్టీకి ఓటమి అంటూ కామెంట్ చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న ఆమె పాత పేరు, కొత్త ఎజెండాతో ముందుకు వస్తానంటూ హింట్ ఇచ్చారు. టీఆర్ఎస్ పేరు ఫ్రీ లిస్టులో ఉన్నదని, దాన్ని ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. దీంతో కవిత పెట్టబోయే పార్టీ పేరు ‘టీఆర్ఎస్’ అనే ప్రచారం ఊపందుకుంది. ఆ పార్టీ పేరుపై ఈ నెల 25న స్వయంగా ఆమె ప్రకటించనున్నారు.

ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కవిత కొత్త పార్టీపైనా, టీఆర్ఎస్ పేరుపైనా కేటీఆర్ స్పందించడం గమనార్హం. మళ్లీ టీఆర్ఎస్ పార్టీ పేరును కేసీఆర్ వెనక్కి తెచ్చుకుని కవితకు ఆ చాన్స్ లేకుండా చేయడానికి ఈ కామెంట్లు ముందస్తు సంకేతాలేమో అనే మాటలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పేరు పెట్టి తప్పు చేశామనే రియలైజేషన్ కావొచ్చనే వాదనా లేకపోలేదు. పేరు మార్చడం వల్లనే ప్రజలకు దూరమయ్యామని, తెలంగాణ అస్తిత్వంతో కనెక్షన్ కట్ అయిందని కేసీఆర్ అనుచరులు మదనపడుతున్నారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అలాంటి అసంతృప్తివాదుల్లో కొంత ఉత్సాహాన్ని నింపినట్లయింది. నిజంగానే బీఆర్ఎస్ త్వరలోనే మళ్లీ టీఆర్ఎస్‌గా మారనుందా? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగనుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏదైనా సాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>