కలం, వెబ్ డెస్క్ : పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కు లేదని.. రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు.. రైతులకు వెన్ను పోట్లా? అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నాట్లు వేసేటప్పుడు కేసీఆర్ టైంలో రైతు బంధు పడేదని.. కానీ, ఇవాళ పంటలు కోతకు వచ్చినా రైతుబంధు దిక్కులేదు. రాహుల్ బంధు కాదు.. రైతు బంధు వేయండి’ అని అసెంబ్లీలో నిలదీస్తామని కేటీఆర్ (KTR) అన్నారు.
అన్ని వర్గాలకు హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలకు ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన మరక్షణమే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. రెండున్నరేళ్లు గడిచినా ఇంతవరకు చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు.
దళితబంధు స్థానంలో 12 లక్షలు ఇస్తామన్నారు. ఇంతవరకు అదీ అతీగతీ లేదు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు.. ఇతర వర్గాలకు 10 వేల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2,500 కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రైతులు.. రైతుభరోసా, రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. విద్యార్థులు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం వేచిచూస్తున్నారని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ స్థానంలో కొత్త క్యాలెండర్ ఉంది తప్ప జాబ్స్ లేవని విమర్శించారు. వీటన్నింటిపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ నిలదీస్తాం అని స్పష్టం చేశారు.

