కలం, నిజామాబాద్ బ్యూరో: పట్నం పల్లెగా మారింది.. ఎక్కడెక్కడో ఉన్న బిడ్డలు, బంధువులు సొంతూరికి చేరుకున్నారు.. ఇదంతా ఏదో సాధారణ జాతర కోసం కాదు.. 160 ఏండ్ల నాటి ఓ విశ్వాసాన్ని తరతరాలుగా మోస్తున్న ‘ఊర పండుగ’ (Oora Panduga) కోసం..! ఒకప్పుడు అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుకోవాలన్న ఆకాంక్షతో మొదలైన ఈ వేడుక.. నేడు ఇందూరు నగరాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ఐక్యతా సంబరంగా మారింది. నేడు నిజామాబాద్ మొత్తం ఈ చారిత్రక పండుగను వైభవంగా జరుపుకోనుంది.
1862-1867 మధ్యకాలంలో అప్పటి ఇందూరు నగరంలో ఘోరమైన విపత్తు సంభవించింది. కలరా, గత్తర (ప్లేగు) వ్యాధులు నగరంలో ప్రబలాయి. సరైన వైద్యం లేక, రోజురోజుకూ శవాల దిబ్బగా మారుతున్న ఊరిని చూసి ప్రజలు వణికిపోయారు. ఆ సమయంలో నగర పెద్దలంతా కలిసి, గ్రామదేవతలకు పూజలు చేసి శాంతింపజేస్తేనే ఈ మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందని నమ్మారు. ఆ తర్వాత సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి ఈ పండుగకు ప్రత్యేక నిధులు సమకూర్చి, నగరవ్యాప్తంగా అందరినీ భాగస్వాములను చేస్తూ అత్యంత ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. అలా మొదలైన ఆచారమే కాలక్రమంలో ‘ఊర పండుగ’గా రూపుదిద్దుకుంది.
55 కులాలు.. ఒకే వేదిక
ఈ పండుగ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని ఏ ఒక్కరో లేదా ఒక వర్గమో నిర్వహించరు. నగరంలోని 55 కుల సంఘాల పెద్దలతో కూడిన ‘సర్వ సమాజ్’ కమిటీ ఈ వేడుకను పర్యవేక్షిస్తుంది. వేడుకకు ఇప్పటికే సంప్రదాయబద్ధంగా ‘బండారు (పసుపు పూజ)’ కార్యక్రమంతో అంకురార్పణ చేశారు. సిర్నాపల్లి గడి, ఖిల్లా శారదాంబ గద్దె వద్ద పూజలు నిర్వహించారు.
మామిడి చెక్కతో దేవతలు
ఊర పండుగలో దేవతామూర్తుల తయారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నిజామాబాద్ నగరంలో 12 గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి. పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సారలమ్మ, మహాలక్ష్మి, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మతో పాటు బల్మూరి కొండల రాయుడు, భోగంసాని తదితర దేవతామూర్తులను వడ్రంగి కుటుంబాలు మామిడి చెక్కతో నియమ నిష్ఠలతో తయారు చేస్తాయి. నగరంలోని నకాశీ గల్లీలో వీటి తయారీ జరుగుతుంది. ఇప్పటికే సిద్ధమైన విగ్రహాలను శనివారం రాత్రి ఇందూరు ఖిల్లాలోని తేలు మైసమ్మ గద్దె వద్దకు తీసుకొచ్చారు.
ఖిల్లా నుంచి శోభాయాత్ర
ఆదివారం ఉదయం దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడి నుంచి భారీ శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఈ రథయాత్ర ఖిల్లా నుంచి ప్రారంభమై.. పెద్ద బజార్, గాంధీ చౌక్, గూడెం గల్లీ మీదుగా ‘దుబ్బ’ ప్రాంతానికి చేరుకోనుంది. దారిపొడవునా లక్షలాది మంది నగర ప్రజలు రోడ్లపక్కన నిలబడి అమ్మవార్లకు కొబ్బరికాయలు కొడతారు. పోతురాజుల ఆటలు, శివసత్తుల పూనకాలతో నేటి యాత్రలో వైభవంగా జరగనుంది.
సరి.. ప్రత్యేక ప్రసాదం
నగర రక్షణ కోసం ప్రతి కాలనీలో భక్తులు జంతు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అన్నంతో ప్రత్యేకంగా తయారు చేసిన ‘సరి ప్రసాదాన్ని’ అమ్మవారికి నివేదించి, దానిని నగరవ్యాప్తంగా చల్లుతారు. అలాగే పూర్వీకుల నమ్మకం ప్రకారం దీన్ని ఇళ్లు, పశువులు, పొలాలపై కూడా చల్లుకుంటారు. చివరగా ఈ చెక్క విగ్రహాలను సాంప్రదాయబద్ధంగా నదిలో నిమజ్జనం చేయడంతో ఈ చారిత్రాత్మక ఊర పండుగ ముగుస్తుంది.
ప్రతి వీధిలో బొడ్రాయి..
అమ్మవార్లు వస్తున్న సమయంలో కోళ్లను ఎదురుగా ఎగరేయడం ద్వారా కీడు తొలగిపోతుందని ప్రజలు నమ్ముతారు. మరోవైపు ప్రతి వీధిలో ఎవరికి వారు నడిరోడ్డుపై బొడ్రాయిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మేకలు, కోళ్లను బలిచ్చే సంప్రదాయం కూడా ఉంది.
పొలిమేర దాటరు..
ఇందూరు నగరం ఎంతగా అభివృద్ధి చెందినా.. ఊర పండుగ రోజు పాటించే ‘పొలిమేర’ నియమం మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నది. పక్క గ్రామాల నుంచి మొదలుకొని అమెరికా, ఇతర విదేశాల్లో ఉన్న బిడ్డలు, అల్లుళ్లను సైతం తల్లిదండ్రులు పండుగకు ఆహ్వానిస్తారు. బంధువులను పిలిపించుకుంటారు. నగరంలో ఉండే కొడుకులు, కోడళ్లు కూడా పండుగ రోజు పొలిమేర దాటకూడదన్నది ఆనవాయితీ. పండుగకు వచ్చిన వారంతా వేడుక ముగిసే వరకు నిజామాబాద్‌లోనే ఉంటారు. దీంతో ప్రతి ఇంటా బంధుమిత్రుల సందడి నెలకొంటుంది.
అందరి సంక్షేమం కోసమే – ఆదే ప్రవీణ్, సర్వసమాజ్ కో-కన్వీనర్
నగరంలో పిల్లాపాపలు, పశుపక్ష్యాదుల సంక్షేమం కోసమే ఊర పండుగ జరుపుతున్నాం. గత్తరలాంటి వ్యాధుల నుంచి కరోనా వంటి వ్యాధుల వరకు ఎన్నో విపత్తులను చూశాం. వీటన్నింటి నుంచి ప్రజలను కాపాడాలని గ్రామదేవతలను పూజిస్తున్నాం.
బోనాల తరహాలోనే – కల్పే అర్చన, కార్పొరేటర్
సికింద్రాబాద్ బోనాల జాతర తరహాలోనే నిజామాబాద్ ఊర పండుగ జరుగుతుంది. . దుష్టశక్తులు, కీడు దరిచేరకుండా అమ్మవార్లు కాపాడతారన్నది మా విశ్వాసం. అందుకే పూర్వీకుల నుంచి వస్తున్న ప్రాచీన ఆచారాలు, సంప్రదాయాలతోనే ఊర పండుగను నిర్వహిస్తున్నాం.

