కలం, డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తింది. ఎందుకు ఫోన్లు ట్యాప్ (Phone Tapping) చేశారని, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటని ఆరా తీసింది. పక్కా ఆధారాలను ఆయన ముందు ఉంచి వన్ బై వన్ ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితుడు రాధాకిషన్ రావు ను కూడా పక్కనే ఉంచి.. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ శుక్రవారం 11 గంటలకే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
అంతకు ముందు ఆయన బీఆర్ఎస్ ఆఫీసులో హరీశ్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సిట్ విచారణకు బయలుదేరిన కేటీఆర్ కు (KTR) పార్టీ నేతలు తిలకం దిద్దారు. నేరుగా జూబ్లీహిల్స్ ఠాణాకు ఆయనతో పాటు పలువురు లీడర్లు కూడా వచ్చారు. మిగతా లీడర్లను బయటే ఆపేసి.. కేటీఆర్ ను మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు.
పక్కా ఆధారాలు ముందట పెట్టి..
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఏసీపీ పి.వెంకటగిరి ఆధ్వర్యంలో అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మొదలు బీఆర్ ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు తోపాటు ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొదట కేటీఆర్ అంశాలను పక్కదారి పట్టించేందుకు సిట్ అధికారులపై ఎదురు ప్రశ్నలు వేయబోయారని, దీనికి సిట్ తగిన రీతిలో స్పందించిందని సమాచారం. హరీశ్ రావు విచారణ సందర్భంగా వచ్చిన అంశాలను కూడా కేటీర్ ముందు సిట్ ఉంచినట్లు తెలిసింది. దేశ భద్రత విషయంలో వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను జడ్జిలు, లాయర్లు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలపై ఎందుకు ప్రయోగించారని.. దీనికి వెనుక ఇంకెవరు ఉన్నారనని ఆయనను క్వశ్చన్ చేసినట్లు సమాచారం. గతంలో విచారణ సందర్భంగా చాలా మంది నిందితులు.. ‘బాస్ ’ ఉన్నారని దర్యాప్తు బృందం దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఆ బాస్ ఎవరు? అని కేటీఆర్ ను తాజాగా సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. పలు ప్రశ్నలకు ‘తెలియదు.. యాది లేదు’ అనే యాంగిల్ లో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బదులిచ్చినట్లు సమాచారం. కాగా, సిట్ చీఫ్ సజ్జనార్ విచారణను వర్చువల్ గా మానిటర్ చేశారు.
త్వరలో మళ్లీ పిలుపు
ఈ నెల 20న మాజీ మంత్రి హరీశ్ రావును విచారించిన సిట్.. త్వరలో మళ్లీ రావాల్సి ఉంటుందని ఆయనకు తేల్చిచెప్పింది. ఇప్పుడు కేటీఆర్ కు కూడా అదే విషయం చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఠాణాలోకి వెళ్లిన ఆయన.. సాయంత్రం 6. 30 గంటలకు బయటకు వచ్చారు. దాదాపు ఏడుగంటల పాటు విచారణ సాగింది. హరీశ్ రావును కూడా ఇటీవల ఏడు గంటల పాటు సిట్ ప్రశ్నించింది.
Read Also: రిపబ్లిక్ డే పరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’ శకటం..
Follow Us On: Pinterest


