కలం, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ఏనాడు పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నెల 30న సిరిసిల్లలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర, భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… 2014 నుంచి 2023 వరకు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ (KTR) సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని భావించామని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితి వేరుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్ల నిమిత్తం గడిచిన వారం రోజులుగా సిరిసిల్లలో పర్యటిస్తుంటే తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి విజ్ఞప్తులు చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై కేటీఆర్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని స్థానిక సంఘటనలు స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. సిరిసిల్లలో కరకట్ట నిర్మాణంతో పాటు సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం వల్ల దళితులకు కేటాయించిన దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూములు సాగుకు నోచుకోకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోవడంతోనే, నేడు ప్రజలు తమ వద్దకు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరగనున్న ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు, దళితులు, బలహీన వర్గాలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

