కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా పార్టీ తరఫున అండగా నిలవాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిశానిర్ధేశం చేశారు. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని ఆయన సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో మంగళవారం ఆయన సమావేశమై SIR ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గానికి అత్యంత కీలకమని, దీనిని పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకొని పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు.
ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కేటీఆర్ (KTR) కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే నమోదు చేసిన దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గత జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయని.. వేల సంఖ్యలో ఇతర నియోజకవర్గాల ఓట్లు ఉండటం వల్ల పార్టీ పరాజయానికి దారి తీసిందని వివరించారు. నగరంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా పార్టీ తరఫున అండగా నిలవాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.
Read Also: భారీ శుభవార్త.. నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో నియామక పత్రాలు
Follow Us On : WhatsApp

