కలం, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ అధికార యంత్రంగాలలో పారదర్శకత, బాధ్యతను కలిగి ఉండేందుకు సమాచార హక్కు చట్టం (Right to Information Act-RTI) పౌరుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekar Reddy) అన్నారు. మంగళవారం నల్గొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు, అధికార యంత్రాంగాలను ఉద్దేశించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో సమాచారం ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, అయితే అలాంటి సమాచారాన్ని అందించే బాధ్యత పబ్లిక్ అథారిటీలపై ఉందన్నారు. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతగా సేవలు అందించేందుకు సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని మరువరాదని తెలిపారు.
రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి..
ఈ సందర్భంగా ఆయన (Chandrashekar Reddy) సమాచార హక్కు చట్టంలోని చాప్టర్లు, సెక్షన్లు, ఉపవిభాగాలు తదిత అంశాలపై ఆయా సెక్షన్ల వారిగా వివరించారు. ఈ చట్టం ప్రకారం సమాచారాన్ని కోరే హక్కు పౌరునికి ఉండడంతో పాటు, రికార్డులను, క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేసే అధికారం కూడా ఉంటుందన్నారు. అధికార యంత్రాంగాలు పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికార యంత్రంగాలు తయారు కావాలని సూచించారు. ముఖ్యంగా పబ్లిక్ అథారిటీ బాధ్యతలు, విధులు, నిర్వర్తించే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు 4(1)బి రిజిస్టర్లను అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. వీటన్నిటిని ప్రజలకు తెలిసే విధంగా వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
అధికారులు చట్టంపై అవగాహన పెంచుకోవాలి
రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అమలు, భారతదేశంలో చట్టం అమలు చేస్తున్న వివరాలు తెలియజేస్తూ అధికార యంత్రంగాలు, పీఐఓలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. సమాచార కమిషనర్ భోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అమలు, ఉద్దేశాలు, 41b సెక్షన్ కింద ఇచ్చే సమాచారం తెలియజేస్తూ ఎప్పటికప్పుడు 4(1)(బి) రిజిస్టర్ వివరాలను అప్డేట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రంగాలపై ఉందని తెలిపారు. 60 నుంచి 70% అప్పీల్స్ 4(1)(బి) పైనే వస్తున్నాయని, మరింత సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉందని గుర్తుచేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్ట్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, డీఎఫ్ఓ రాజశేఖర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు ఉన్నారు.
Read Also: SIRపై దృష్టి సారించాలి.. HYD పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
Follow Us On : WhatsApp

