కలం, ఖమ్మం బ్యూరో: హత్యకు గురైన శిరీష కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. బాధితులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా ఆదుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల వెంకట రమణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం చౌటిగూడెంలోని శిరీష నివాసానికి వెళ్లారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు, అనంతరం కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు.
శిరీష కుటుంబంలో జరిగిన విషాదం పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం అధైర్యపడకూడదని, పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా స్థానికంగా అందుబాటులో ఉండే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

