కలం, వెబ్ డెస్క్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. దమ్ముంటే లక్షాధికారులను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. వరంగల్ నగరంలో నిర్వహించిన జన చైతన్య సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి కొండా సురేఖ కుమార్తెనే చెప్పిందన్నారు. సీఎం రేవంత్.. రాహుల్ గాంధీకి బాడీగార్డులా మారిపోయారని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకంటే వయస్సులో చిన్నవారైన అమిత్ షా కాళ్లను బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
500 రోజుల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్..
బీఆర్ఎస్ హయాంలోనే వరంగల్ నగరం అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను వరంగల్ జైల్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి రెండో రాజధానిలా భావించి.. భారీగా నిధులు కేటాయించామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ ఒక్క పని జరగడం లేదన్నారరు. త్వరలోనే పార్టీలోకి భారీ చేరికలు ఉండబోతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం జాడ కనిపించడం లేదన్నారు. ఇప్పటికే మూడేళ్లు అయిపోయాయని.. ఇంకో 500 రోజులు పూర్తయితే కొత్త ప్రభుత్వం రాబోతుందన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం ఖాయమన్నారు.

